Tuesday, July 17, 2012

నా కంటి పాప


గుడి ముంగిట దీపానివై  నా ఎదలోతుల బృందావనివైనావు ...
విడి పడని బంధానివై నా హృదిసందిట ఆనందానివైనావు ...
తడి పెదవుల తడబాటువై నా మది మీటిన మందాకినివైనావు ....
నా అణువణువు లోను నీ ధ్యాసే...
మనసులో ముద్ర పడిన నీ రూపాన్ని ,
ప్రతిక్షణం స్మరిచాలానే నా ప్రయాస . 

చెరగని చిరునవ్వులతో చిత్విలాసంగా నవ్వే నీకళ్ళు ...
నీ మనసు చెరలో నన్ను  చిరకాలపు ఖైదీని చేసాయి 

కరుణ నిండిన ఆ కళ్ళకి కంటిపాపై కావలి కాస్త.
నువ్వు చూడలేని ప్రపంచాన్ని నాకు చూపించావు.
నువు లేని ఈ లోకాన్ని వీడోద్దని శాసించి వెళ్లావు...
నాకు తోడుగా.....నీ నీడగా "నీ చూపుని" మాత్రం నాకు వరంగా మిగిల్చావు......

Monday, April 12, 2010

నీ రాకకై......

కాలమెంత కఠినమైనదో కదా...
కళ్ళు ఇంతలుగా చేసి...నీ రాకకై ఎదురు చూసే కొలదీ,
అది నా ఒంక కళ్లార్పకుండా చూస్తోంది.
మరి అది రేప్పవేయకపోతే...నాకిక కునుకేది...???

నేస్తం...నీకో నిజం చెప్పనా...
నా చుట్టూ ఉన్నవారెవరైనా "బెంగ"పెట్టుకున్నానంటే...
వాళ్ళకేసి ..చులకనగా, తక్కువగా చూసిన నేను...
ఈనాడు ఆ భావోద్వేగానికి లోనయ్యానంటే.....నమ్ముతావా...??
హు...నువ్వేమిటి...నన్ను చూసి నేనే..నమ్మలేకపోతున్నాను.

మనసు బరువేక్కిందంటే ఏమో..అనుకునే దాన్ని.
కన్నులు అరమోడ్పులు కాకపోగా ఆ భారమంతా..
కొన్ని శతాబ్దాలుగా నీ జ్ఞాపకాల శిలలను
నాగుండెల్లో సజీవంగా సమాధి చేసుకొన్నభావనను,
బహుసా...నా ఈ చిన్ని మనసు...
మోయలేక బరువెక్కిపోయిందేమో...అనిపిస్తోంది.

అయినా ఎవరు చెప్పారు ఎదురుచూపుల్లో ప్రేమ పెరుగుతుందని..??
నన్నేదిరిస్తే...గాలిని సైతం ఛిద్రం చేయాలనుకునే నేను...
నీకై నన్నేదిరించి మరీ ఎదురుచూసే...
నా చూపులను సైతం మరల్చలేకున్నాను.
దీన్నే...ప్రేమ పెరగటం అంటారా...కానే...కాదు...
ఏమీ చేయలేని..నా ఈ దుస్థితిని "అచేతనావస్థ"అని అంటాను.
దీనికి కారణం "ప్రేమే"నని అంటే..కాదు..."పిచ్చి" అని అంటాను.
చిత్రం !! ఇదేనేమో నీమీద నాకున్న "పిచ్చి ప్రేమ".

ఏ బాధనైనా, బంధాన్నైనా, భావాన్నైనా..
నాలోనే సమాధి చేయగల నేను...
నీ మీది ఈ భావాలను మాత్రం సమాధి చేయలేని..
అచేతనావస్థలో ఉండి...ఈ చేవ్రాలును భావయుక్తంగా వ్రాస్తున్నాను...

ఏది ఏమైనా , నా మనసు మాత్రం...... గతి తప్పి,
మతిలేనిదానిలా అగమ్యగోచరమైన త్రోవను ఎన్నుకుని,
మాలినీ మనోహరుని హృదయపుటంచులనైనా చేరుకోవాలని ప్రయత్నిస్తోందని...
బరువెక్కిన నా ఈ మనసు...అరమోడ్పులు కాని నా ఈ కన్నులు...నాకు తెలియజేస్తున్నాయి.

బహుసా ......ఇదేనేమో....."బెంగంటే".........

Wednesday, September 30, 2009

చెప్పనా?

చెలీ,
చెంపకు చారెడు కన్నులున్న నీవు,
నా...............................................
కనులకి కలల కాటుకవా !
తలపులకి వలపు వాకిటవా !
చీకటి తెరలకు వేకువవా !
మాపటి ఊహకు తూరుపువా !
చిలిపి ఆశలవేల ఆమనివా !
కలల కోరికల మేలకువవా !
మౌనభాష్యాన మధుర గీతికవా !
మేని మలుపుల అధర కావ్యానివా !

ఏమని చెప్పను.............................

నా మదినేలెడి మాలినివని చెప్పనా,
నా వ్యధ తీర్చే వరూదినివని చెప్పనా,
నా హృది వాకిట వేన్నేలవని చెప్పనా,
నా తలపుల తలుపులు తెరిచే తాపసివని చెప్పనా,
నా కవితల కెరటాలు వలచె కావ్యానివని చెప్పనా,
నా కనుల ముంగిట్లో కలల నేలతవని చెప్పనా,

చెప్పనలవికాని ఈ భావాలకి భాష్యం చెప్పే భాష,
నావద్ద లేదని చెప్పనా !

Tuesday, September 29, 2009

ఆలోచన-ఆలాపన

క్షణానికో ఆలోచన, క్షణానికో ఆలాపన
ఆలోచనలే ఆకృతి దాల్చితే?
ఆలాపనలకి అర్ధం తడితే?
నేనొక మనసుకవినైపోతానేమో !
మరి ఆక్షణాన కవితై పొంగానా కవినై ఉప్పొంగానా !!

Monday, September 28, 2009

దరిచేరేనా !!

నా మొదటి అడుగు వేసింది నీకోసమని తెలుసు.
నే వెళ్ళే దారి నువ్వని తెలుసు.
ఒక్కోదారిదీ ఒక్కో తీరనీ తెలుసు.
ఆ దారుల తీరులన్నింటికీ దరి నీవని తెలుసు.
కాని,ఆ గమ్యం అగమ్యమా లేక గమనమా
అన్నది కాలమే తేల్చాలి మరి !!

Wednesday, September 9, 2009

వర్ణింపతగునా !

మరులుగొలిపే మేటి మకరందమా !
మదనమోహనా కౌగిట మందారమా ,

మనసు పడినవేళ ఆనందమా !
మరల వోడినిచేరు అనుబంధమా ,

చంద్రకాంతి తోడ మృగమద చందనమా !
ఇంద్రనీలమణి పలికిన వందనమా ,

తనువును తాకిన తోలి కుందనమా !
మనువుగా మారిన మలి బంధనమా ,

కలల కాటుక నడుమ కుంజరమా !
తలపు కెరటాల వలపు పంజరమా ,

ఏమని పొగడుదును? ఎటులని వర్ణింతును?
ఈ తోలి తేలి నీడల క్రీడలను !!!